టెక్కలి డివిజన్‌లోని 12 బీసీ వసతి గృహాల్లో 356 మందికి కొత్తగా ప్రవేశాలు 120 మంది బాలికలు, 236 మంది బాలురు.. నా ణ్యమైన వసతి, భోజనం అందేలా చర్యలు కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన ప్రత్యేక చొరవతో టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతి గృహాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 356 మంది విద్యార్థులకు కొత్తగా ప్రవేశాలు కల్పించారు. సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ వసతి గృహాల సలహా కమిటీ చైర్మన్‌గా అచ్చెన్నాయుడు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి డివిజన్ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలపై సమీక్షించి, అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. కొత్తగా ప్రవేశాలు పొందిన 356 మందిలో 120 మంది బాలికలు, 236 మంది బాలురు ఉన్నారు. దీంతో గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు స్వగ్రామాలకు దూరంగా చదువుకునే సమయంలో వసతి, భోజనం తదితర సౌకర్యాలు పొందే అవకాశం ఏర్పడి, వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, సురక్షితమైన వసతి, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. బీసీ విద్యార్థులకు విద్యా అవకాశాలను విస్తరించడం ద్వారా ఉన్నత విద్య, భవిష్యత్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సమావేశంలో టెక్కలి సహాయ బీసీ సంక్షేమాధికారి, సంబంధిత బీసీ వసతి గృహాల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు