Kaizer News

వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపు : కిష‌న్‌ర

వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపు : కిష‌న్‌రెడ్డి

· State - Telangana · prabhanews.com

వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను ప‌రిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల కల్పన తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి.. వేగంగా సాగుతున్న మౌలిక సదుపాయాల పనులు వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు సమకూరనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వికారాబాద్‌తో పాటు తాండూర్, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి తదితర ప్రధాన స్టేషన్లను ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కొత్త వెయిటింగ్ హాల్, ప్రయాణికుల విశ్రాంతి కేంద్రం, మెరుగైన పార్కింగ్ సదుపాయాలతో పాటు ఇతర అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్‌ను కేవలం ప్రయాణ కేంద్రంగా కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగమిస్తున్నాయని తెలిపారు. రైల్వే మార్గాల విస్తరణలో భాగంగా డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మార్గాల పూర్తి స్థాయి విద్యుదీకరణ పూర్తవడం రాష్ట్ర రైల్వే రంగ అభివృద్ధిలో కీలక ముందడుగని అన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయితే స్థానిక ప్రయాణికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభించనుంది. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలోని ఇతర ప్రధాన స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా వేగంగా పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News