Kaizer News

సమస్యల సుడిగుండంలో వేలేరుపాడు

సమస్యల సుడిగుండంలో వేలేరుపాడు

· State - Telangana · prabhanews.com

కోతకు గురైన రహదారులు.. అంధకారంలో ఏజెన్సీ గ్రామాలు వేలేరుపాడు, ఆంధ్రప్రభ : వేలేరుపాడు మండలంలోని ఏజెన్సీ గ్రామాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పర్యవేక్షించాల్సిన పాలకవర్గాల పదవీకాలం ముగియడం, అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. పాడైన రహదారులు, అంధకారంలో పలు గ్రామాలు, తాగునీటి కష్టాలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మండలంలోని రామవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గుళ్లవాయి–రామవరం మధ్య ఉన్న ప్రధాన రహదారి వర్షాలకు తీవ్రంగా దెబ్బతింది. రహదారి కింద ఉన్న కల్వర్టులు కుంగిపోవడంతో ఒకవైపు పెద్ద గుంత ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాల చోదకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంత వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాల నివారణకు స్థానికులే గుంత వద్ద తాటి కమ్మను అడ్డుగా ఏర్పాటు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళ వీధులన్నీ అంధకారంలో మగ్గుతున్నాయి. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని దీపాలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం వాటి నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వీధి దీపాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేదని పేర్కొంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చింతలపాడు, టేకూరు, కాకిసునూరు, కోయిదా, కట్కూర్, ఎర్రతోపు, బొర్రెడ్డిగూడెం, కమ్మరిగూడెం, జిన్నేలగూడెం, రెడ్డిగూడెం, తెలపల్లి తదితర గ్రామాల్లో విష కీటకాలు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కమ్మరిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు పాముకాటుకు గురై మృతి చెందడం ఏజెన్సీ వాసుల్లో ఆందోళనకు కారణమైంది. పాముకాటుకు గురై పలువురు ఆసుపత్రుల పాలైన ఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. దీనికి తోడు చీకట్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ పాదచారులు, వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో భద్రత కల్పించాలని కోరుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత నెలలో వచ్చిన గోదావరి వరదల కారణంగా కట్కూర్, ఎడవల్లి, కోయిదా, తిరుమలాపురం, తాటుకూరు గొమ్ము, రుద్రమకోట, రేపాక గొమ్ము తదితర గ్రామాల్లో తాగునీటి బోర్లు, విద్యుత్‌ మోటార్లు పూర్తిగా నీటమునిగాయి. పలుచోట్ల బోర్లు ఇసుకలో కూరుకుపోగా, మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక ప్రవహిస్తున్న నీటిని బిందెలు, కావడులతో తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. కలుషిత నీటిని వినియోగించడంతో పలువురు అనారోగ్యానికి గురవుత

Original source: prabhanews.com
Read more on Kaizer News