Kaizer News

Markapur: పెద్ద దోర్నాలలో గిరిజనులు, వృద్ధుల కోసం

Markapur: పెద్ద దోర్నాలలో గిరిజనులు, వృద్ధుల కోసం ప్రత్యేక న్యాయ సేవల శిబిరం!

· State - Telangana · hmtvlive.com

Shorts Markapur: పెద్ద దోర్నాల జెడ్పీ హైస్కూల్‌లో గిరిజన హక్కులు, సీనియర్ సిటిజన్లకు అందించే చట్టపరమైన సేవలపై ప్రత్యేక న్యాయ సేవల శిబిరాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి ఏ. సత్యానంద్, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. అటవీశాఖ, ఐసీడీఎస్, వ్యవసాయశాఖ, ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఆర్‌డీటీ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేసి గిరిజనులకు అందుతున్న వివిధ సంక్షేమ పథకాలు, సేవలపై అవగాహన కల్పించాయి. అనంతరం ఆర్‌డీటీ ఆడిటోరియంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా వృద్ధులు కూడా తమకు అందుబాటులో ఉన్న హక్కులు, చట్టపరమైన సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రస్తుత చట్టాలు, ఆరోగ్య పథకాలు, అక్షరాస్యత, న్యాయ సలహాలు, బీమా తదితర అంశాలపై అవగాహన అవసరమని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని కోర్టులో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా న్యాయ సలహాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. అవసరమైన వారికి న్యాయపరమైన సహాయం అందించడంతో పాటు వివిధ బాధ్యతలను న్యాయ సేవా సంస్థలు స్వీకరిస్తాయని చెప్పారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కూడా ఎలాంటి ఫీజు తీసుకోకుండా గిరిజనులకు న్యాయపరమైన సహకారం అందిస్తుందని వివరించారు. ప్రతి గిరిజనుడు అటవీ హక్కులతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి ఏ. సత్యానంద్ సూచించారు. తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు అవసరమైనప్పుడు న్యాయ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా జడ్జి భవాని, సీహెచ్. రామకృష్ణ (డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఒంగోలు), మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, కలెక్టర్ ఎం. విజయ సునీతతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News