Cheepurupalli: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఇళ్లకే తీసుకెళ్లి అందజేశారు. చీపురుపల్లి పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పర్యటించి, అర్హులైన ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ, వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ సహాయాన్ని కార్యాలయాలకే పరిమితం చేయకుండా లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్తున్నామని తెలిపారు. సహాయం అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని రామ్ మల్లిక్ నాయుడు హామీ ఇచ్చారు