Kaizer News

గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్య

గిరిజన యువకుడి ఆత్మహత్య.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడిపై వేధింపులే కారణం!

· State - Telangana · ntnews.com

బైక్‌ విషయంలో మొదలైన వివాదం విషాదంగా మారింది. ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. తన కుమారుడి మృతికి యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ మనవడు, ఎల్బీనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు పోచబోయిన సురేశ్‌ యాదవ్‌ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన రాజేష్‌ అనే యువకుడికి, సురేశ్‌ యాదవ్‌కు బైక్‌ విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో జరిగిన పంచాయితీలో రాజేష్‌పై దాడి చేసి వేధింపులకు గురిచేశారు. గత మూడు రోజులుగా ఇదే విషయమై సురేశ్‌ యాదవ్‌ నుంచి వేధింపులు కొనసాగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ వేధింపులు తాళలేక రాజేష్‌ అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజేష్‌ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌ రంగంలోకి దిగారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదారి పట్టించేలా మృతుడి తల్లితో సెటిల్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ‘నీకెన్ని డబ్బులు కావాలో ఇస్తా.. కానీ నా మనవడికి ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులకు చెప్పాలి’ అంటూ ఈశ్వరమ్మ యాదవ్‌ తనకు ఫోన్‌ చేసినట్లు రాజేష్‌ తల్లి ఆరోపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే.. తన మనవడు సురేశ్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్‌ నాశనం చేయొద్దని కోరుతూ రాజేష్‌ తల్లికి ఫోన్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, రాజేష్‌ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌, సురేశ్‌ యాదవ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News