కేసుల్లో నిందితుడు.. చర్లపల్లి జైలుకు తరలింపు ఇచ్చోడ, ఆంధ్రప్రభ: వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన గోపాల్ సింగ్ షెకావత్ (32)పై తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం–1986 (పీడీ యాక్ట్) కింద చర్యలు తీసుకున్నట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్ తెలిపారు. పీడీ యాక్ట్ కింద నిర్బంధించిన నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. గోపాల్ సింగ్ షెకావత్‌పై జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 12 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. నేరడిగొండ, గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడన్నారు. హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు, దాడులు, వసూళ్లకు సంబంధించిన నేరారోపణలు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా జాతీయ రహదారి–44పై వాహనదారులు, రవాణా నిర్వాహకులను వేధిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అతని కార్యకలాపాలు ప్రజా శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్ ఆదేశాలతో నిర్బంధ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు