డ్రోన్ సాయంతో అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ.. వినియోగదారుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు గంజాయి విక్రయదారుల సమాచారం ఇస్తే రూ.5 వేల బహుమతి.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: గంజాయి మూలాలపై ఇబ్రహీంపట్నం పోలీసులు నిఘా పెంచారు. గంజాయి వినియోగం, విక్రయాలను అరికట్టేందుకు ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలు, కొండపల్లి బ్యాంక్ సెంటర్ ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో జల్లెడ పట్టారు. తమ సమాచార నిఘా వ్యవస్థలో లేని గంజాయి వినియోగదారుల గురించి సమాచారం అందించి వారిని పట్టిస్తే రూ.1,500 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. గంజాయి విక్రయించే వారి సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించే వారిని గంజాయి వినియోగదారులుగా పరిగణించవద్దని ప్రజలు, యువతకు పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలను వివరించారు. గంజాయి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. అదే విధంగా ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సత్యవతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు