ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల ఏరివేత కార్యక్రమాన్ని ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ చేపట్టింది. సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, కార్యనిర్వహణాధికారి శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో కోతులను పట్టుకునే కార్యక్రమం నిర్వహించారు. పట్టుకున్న కోతులను బోన్లలో ఉంచి అడవుల్లో సురక్షితంగా విడిచిపెట్టారు. పట్టణంలోని కాలనీల్లో కోతులు ఇళ్లలోకి ప్రవేశించడం, ప్రజలపై దాడులకు పాల్పడటం, చిన్నపిల్లలు, వృద్ధులను భయాందోళనకు గురిచేయడంతో స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కోతుల వల్ల ఇళ్ల పైకప్పులు, నిత్యావసర వస్తువులు దెబ్బతినడంతో పాటు ఇతర ఆస్తి నష్టం జరుగుతోందని ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రత్యేక చొరవ తీసుకుని చేపట్టిన కోతుల ఏరివేత చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోతులను అడవుల్లోకి తరలించడంతో వీధుల్లో అలజడి తగ్గి, నివాస ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు