Kaizer News

అమీన్‌సాహెబ్‌పాలెంలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం

అమీన్‌సాహెబ్‌పాలెంలో నూతన పంచాయతీ భవనం ప్రారంభం

· State - Telangana · prabhanews.com

గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాదెండ్ల, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామంలో రూ.32 లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై వారు చర్చించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కేవలం ప్రజాప్రతినిధుల వల్లే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో నిలిచిపోయిన జల్‌ జీవన్‌ మిషన్‌ తాగునీటి పథకానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రభుత్వంతో మాట్లాడి మళ్లీ నిధులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేలా పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజలు కూడా దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ తెలిపారు. పొలాల నుంచి ఇళ్లకు ఉచితంగా మట్టి తరలించుకోవచ్చని, ఇందుకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే ఎమ్మెల్యేకు లేదా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో సుమారు 250 కిలోమీటర్ల మేర పొలాల బాటలు, రహదారుల అభివృద్ధి పనులు పూర్తిచేశామని తెలిపారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని, ప్రాంతాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News