ముంబై: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబే విద్యార్థి పరీక్షలో చాట్‌జీటీపీని ఉపయోగించి పట్టుబడ్డాడు. ఆ తర్వాత రూమ్‌కు వెళ్లిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థి మరణంపై ఐఐటీ బాంబే క్యాంపస్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. (IIT Bombay Student suicide) మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సాహిల్ వాకోడే రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం పరీక్షా సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించాడు. సమాధానాల కోసం ప్రశ్నాపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి పట్టుబడ్డాడు. ఆ తర్వాత రూమ్‌కు వెళ్లిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఆ విద్యార్థి ఆత్మహత్యపై ఐఐటీ బాంబే స్పందించింది. ఆ విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. సంబంధిత లెక్చరర్, విభాగ అధిపతి ఆ విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అతడి విద్యాపరమైన భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కూడా భరోసా ఇచ్చినట్లు వివరించారు. అలాగే ఒక విద్యార్థిని కోల్పోవడం పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఐఐటీ బాంబే ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ విషాదకరమైన ఘటనతో ప్రభావితమైన సదరు విద్యార్థి స్నేహితులు, సహాధ్యాయులు, అధ్యాపకులు, ఇతరులకు సంస్థ అండగా నిలుస్తుంది. ఈ మరణానికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు’ అని పేర్కొంది. అయితే తన కుమారుడు వేధింపులకు గురయ్యాడని ఆ విద్యార్థి తల్లి ఆరోపించారు. ‘నా కుమారుడిని చంపేశారు. అతడు తీవ్ర వేధింపులకు గురయ్యాడు. నాకు న్యాయం కావాలి. దీనిపై నేను ఫిర్యాదు చేశా’ అని ఆమె అన్నారు. మరోవైపు గత ఏడు నెలల వ్యవధిలో ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మూడవ ఆత్మహత్య సంఘటన జరుగడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ సంఘటనపై పూర్తి వాస్తవాలను సంస్థ వెల్లడించలేదని, ఆ విద్యార్థిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించినట్లు వారు ఆరోపించారు. తమ విద్యా సంస్థ నుంచి బాధ్యతాయుత, పారదర్శకత సమాధానాలను డిమాండ్ చేస్తున్నట్లు ఒక విద్యార్థి తెలిపారు. కాగా, నిరసన చేస్తున్న విద్యార్థులతో ఐఐటీ బాంబే అధికారులు చర్చలు జరుపుతున్నారు. అక్కడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు క్యాంపస్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు భారీగా పోలీసులను మోహరించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు