Kaizer News

Vinukonda: స్వచ్ఛతలో వినుకొండను ఆదర్శంగా నిలపాలి:

Vinukonda: స్వచ్ఛతలో వినుకొండను ఆదర్శంగా నిలపాలి: చీఫ్ విప్ జీవీ

· State - Telangana · hmtvlive.com

Shorts Vinukonda: స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం వినుకొండ పట్టణంలోని 30వ వార్డు సంజీవ్ గాంధీ నగర్‌లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌తో పాటు ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పరిశుభ్రత అనేది ప్రభుత్వం లేదా మున్సిపల్ సిబ్బంది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు వీధులు, వార్డులు, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సంజీవ్ గాంధీ నగర్‌లో చెత్త పేరుకుపోయే ప్రాంతాలను పరిశీలించిన జీవీ.. చెత్తను తొలగించడంతో పాటు తిరిగి పేరుకుపోకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అవగాహన బోర్డులు, వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థులు, యువత స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్వచ్ఛత ఒకరోజు కార్యక్రమం కాదని, నిరంతరం కొనసాగాల్సిన ప్రజా ఉద్యమమని అన్నారు. అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేసి స్వచ్ఛతలో వినుకొండను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని జీవీ పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News