Kaizer News

Kaligiri: స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ గెలవాలి: మ

Kaligiri: స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ గెలవాలి: మేకపాటి రాజగోపాల్‌రెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.కలిగిరిలోని ఆవుల రమణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు, చంద్రబాబునాయుడు పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. గతంలో సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద విషయం కాదంటూ విమర్శలు చేశారు. మేకపాటి కుటుంబం ఎప్పటి నుంచో పేద ప్రజలకు అండగా ఉంటూ.వారి కష్టాల్లో సహాయం చేయడంలో ముందుంటుందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా దండుకునే పనుల్లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో చిన్నచిన్న మనస్పర్థలు, విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే విజయంతో 2029 ఎన్నికలకు మరింత ఉత్సాహంతో ముందుకు సాగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News