నిమజ్జన వేళ కూలిన విద్యుత్ పోల్.. తీగలు చుట్టుకున్నా తప్పిన ప్రాణాపాయం నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పెను ప్రమాదం తప్పింది. నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న సమయంలో విద్యుత్ పోల్ అకస్మాత్తుగా విరిగి రోడ్డుపై పడిపోయింది. విద్యుత్ తీగలు కూడా తెగి వేలాడటంతో భక్తులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని బనగానపల్లె టీ స్టాల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ గణనాథుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్ కూలిపోయింది. పోల్ రోడ్డుపై పడటంతో నిమజ్జన ఊరేగింపును కొంతసేపు నిలిపివేశారు. అదృష్టవశాత్తూ పోల్ పడిన సమయంలో దాని సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ తీగలు రోడ్డుపై వేలాడటంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే నందికొట్కూరు సీఐ టి. సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ ఓబులేసు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విద్యుత్ సిబ్బందితో సమన్వయం చేసి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ పోల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పోల్స్‌ను మార్చాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గణేష్ నిమజ్జనం వంటి భారీ ఊరేగింపులు జరిగే సమయంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పాత పోల్స్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు