Kaizer News

Koradi Ganapathi | మాటేగాంలో కొలువుదీరిన కొరడి గణప

Koradi Ganapathi | మాటేగాంలో కొలువుదీరిన కొరడి గణపతి..

· State - Telangana · prabhanews.com

దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు భైంసా, ఆంధ్రప్రభ : సాధారణంగా దేవతా విగ్రహాలను రాయి, లోహం, కర్రలతో శిల్పులు, కళాకారులు రూపొందిస్తారు. అయితే మానవ ప్రమేయం లేకుండా చెట్టు వేరుభాగంలో సహజసిద్ధంగా గణపతి ఆకారంలో వెలసిన విగ్రహాన్ని భక్తులు ‘కొరడి గణపతి’గా పిలుస్తున్నారు. భక్తుల కోరికలు నెరవేరుతున్నాయనే విశ్వాసంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలోని భైంసా పట్టణం నుంచి నిర్మల్‌ వెళ్లే ప్రధాన రహదారికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో మాటేగాం గ్రామంలో కొరడి గణపతి కొలువుదీరింది. స్థల పురాణం ప్రకారం.. 2015లో మాటేగాం గ్రామానికి చెందిన రైతు ప్రకాశ్‌ పటేల్‌ తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్లను జేసీబీ సాయంతో వేర్లతో సహా తొలగించి, వాటి మొదళ్లను డాక్టర్‌ తుకారం ఇంటి పక్కన భద్రపరిచారు. వాటిలో కొన్ని మొదళ్లను ఇంటి అవసరాలకు వినియోగించగా.. మిగిలినవి రెండేళ్లపాటు అక్కడే నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2017లో ముగ్గురు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా బంతి ఆ మొదళ్ల వద్దకు వెళ్లింది. బంతిని తీసుకునేందుకు వెళ్లిన పిల్లలకు గణపతి ఆకృతిలో కనిపించిన వేరు భాగం ఆకర్షణగా మారింది. దీంతో దానిని ఇంటి ఆవరణలోకి తీసుకువచ్చి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లడంతో పండితులు, పూజారులు పరిశీలించారు. సహజసిద్ధంగా గణపతి ఆకారంలో ఏర్పడిన కొరడిగా గుర్తించి పూజలు నిర్వహించాలని సూచించారు. వేద పండితుల సూచనల మేరకు ప్రత్యేక స్థలంలో కొరడి గణపతిని ప్రతిష్ఠించి 2017 జూలై 23న శ్రావణ అమావాస్య సందర్భంగా గ్రామ పెద్దలు పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొరడి గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తొలినాళ్లలో వేల సంఖ్యలో వచ్చిన భక్తులు ప్రస్తుతం లక్షల సంఖ్యకు చేరుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మాటేగాం గ్రామస్తులు భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 5.15 గంటలకు కాగడ హారతి, ఉదయం 7.30 గంటలకు, 8 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ భజనలు, కీర్తనలతో గ్రామం భక్తిభావంతో పరవశిస్తోంది.ముథోల్‌ నియోజకవర్గం 1956 వరకు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ ప్రాంతంలో మట్టి, కర్రలను పూజించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News