Kaizer News

Malikipuram: చిత్రరూపంలో తెలుగు భాషా దినోత్సవం!

Malikipuram: చిత్రరూపంలో తెలుగు భాషా దినోత్సవం!

· State - Telangana · hmtvlive.com

Malikipuram: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎన్. సంగీత్ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. తెలుగు భాషా దినోత్సవ విశిష్టతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ కవి, సంఘ సంస్కర్త, వ్యావహారిక భాషా ఉద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలు సాధారణంగా మాట్లాడే వ్యావహారిక భాషకు గ్రంథస్థ గౌరవం కల్పించడంతో పాటు, విద్యాబోధనలోనూ వ్యావహారిక భాషను ఉపయోగించాలని గిడుగు రామమూర్తి గట్టిగా ఉద్యమించారు. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉండటంతో పాటు, ప్రాచీన భాషగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా సంగీత్ రూపొందించిన చిత్రంలో తెలుగు అక్షరాలు తెలుగు తల్లికి నీరాజనం పలుకుతున్నట్లుగా, విద్యార్థినీ విద్యార్థులు తెలుగు తల్లికి, గిడుగు రామమూర్తికి వందనం చేస్తున్నట్లుగా కళాత్మకంగా చిత్రీకరించారు. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మలికిపురంలోని సునయన ఆర్ట్ అకాడమీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగు భాష పట్ల అభిమానం, గిడుగు రామమూర్తి చేసిన కృషిని ప్రతిబింబించే ఈ చిత్రకళా రూపకల్పన పలువురి ప్రశంసలు అందుకుంటోంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News