Kaizer News

Rasamayi Balakishan | బిల్డింగ్ కట్టడం చేత కాదు..

Rasamayi Balakishan | బిల్డింగ్ కట్టడం చేత కాదు.. రాజకీయాలు చేస్తున్నావ్.. మానకొండూరు కవ్వంపల్లిపై రసమయి ధ్వజం

· State - Telangana · ntnews.com

మన్నెంపల్లిలో మహిళా భవనం కూల్చివేత అన్యాయం అధికారులతో దొంగ నివేదికలు రాయిస్తున్నారు అభివృద్ధి చేతగాక ప్రతిపక్షాలపై రాక్షస దాడి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహం Rasamayi Balakishan | తిమ్మాపూర్, సెప్టెంబర్20 : మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభివృద్ధిని విస్మరించి చిల్లర, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార బలంతో అధికారులను బెదిరిస్తూ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై రాజకీయ యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. తిమ్మాపూర్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన్నెంపల్లి గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, కలెక్టర్ నిధులతో ఆరు గుంటల స్థలంలో మహిళా భవన నిర్మాణాన్ని ప్రారంభించామని రసమయి తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకుల కక్షతో ఆ పనులను అడ్డుకోవడమే కాకుండా, బాగున్న పాత గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లుగా భవనం వాడకంలో లేదని, కూలిపోయే స్థితిలో ఉందంటూ పీఆర్ ఏఈ తప్పుడు నివేదిక తయారు చేశారని మండిపడ్డారు. మూడేళ్ల క్రితం వరకు వాడిన భవనంపై దొంగ నివేదికలిచ్చిన అధికారులపై, ప్రొటెక్షన్ ఇచ్చిన పోలీసులపై కలెక్టర్‌కు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 35 నెలల్లో ఒక్క భవనం కట్టించావా..? బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో 89కి పైగా మహిళా సంఘ భవనాలు నిర్మించి మహిళా సాధికారతకు కృషి చేశామని గుర్తు చేశారు. ఈ 35 నెలల కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తన సొంత నిధులతో ఏ ఒక్క గ్రామంలోనైనా మహిళా భవనాన్ని కట్టించారా..? అని సూటిగా ప్రశ్నించారు. మహిళలను వర్గాలుగా విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. అసెంబ్లీ సాక్షిగా రోడ్ల నిర్మాణం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే, నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలు, సర్పంచుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండలాధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు దేవేందర్ రెడ్డి, నాయకులు పొన్నం అనిల్, అశోక్ రెడ్డి, సర్పంచులు ఆంజనేయులు, తార్ల తిరుపతి, శ్రీనివాస్, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News