Kaizer News

Gondhal Movie | ఆస్కార్‌ బరిలో ‘గోంధల్‌’.. ‘ధురంధర

Gondhal Movie | ఆస్కార్‌ బరిలో ‘గోంధల్‌’.. ‘ధురంధర్‌’, ‘పెద్ది’లను దాటి పోటీలో నిలిచిన మరాఠి సినిమా

· National - India · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఆస్కార్‌ బరిలో ఎవరి సినిమా నిలుస్తుందా? అని ఎదురుచూస్తున్న భారతీయ సినీ ప్రేక్షకులకు ఊహించని ఫలితం వచ్చింది. భారీ అంచనాలతో బరిలో నిలిచిన ‘ధురంధర్‌’, ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘హనుమాన్‌ అంశ్‌’ వంటి చిత్రాలు అధికారిక ఎంట్రీగా ఎంపిక కాలేదు. వాటిని వెనక్కి నెట్టి.. మరాఠీ సినిమా ‘గోంధల్‌’ 99వ అకాడమీ అవార్డ్స్‌లో భారత్‌ తరఫున బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. 2027 ఆస్కార్‌ కోసం భారత్‌ తరఫున అధికారిక ఎంట్రీని ఎంపిక చేసేందుకు ఈసారి మొత్తం 33 సినిమాలు పోటీలో నిలిచాయి. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, మరాఠీతో పాటు పలు భారతీయ భాషల చిత్రాలు ఉన్నాయి. తెలుగు నుంచి ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘సింగీతం’, ‘ఎగ్వా’ సినిమాలు పోటీలో ఉండగా.. హిందీ నుంచి ‘ధురంధర్‌’, ‘ధురంధర్‌: ది రివెంజ్‌’, ‘హనుమాన్‌ అంశ్‌’, ‘హక్‌’, ‘120 బహదూర్‌’, ‘బోర్డర్‌ 2’ తదితర చిత్రాలు పరిశీలనకు వెళ్లాయి. అయితే వీటన్నింటిలో నుంచి ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FFI) ఎంపిక కమిటీ సంతోష్‌ దవాఖర్‌ దర్శకత్వం వహించిన ‘గోంధల్‌’ను భారత్‌ తరఫున ఆస్కార్‌ ఎంట్రీగా ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక చేసింది. ‘గోంధల్‌’ ఒక మరాఠీ థ్రిల్లర్‌. మహారాష్ట్రలో సంప్రదాయంగా జరిగే గోంధల్‌ అనే రాత్రిపూట జరిగే జానపద ఆచారం, సంగీతం, నృత్యం, పురాణ విశ్వాసాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సంప్రదాయాన్ని కేవలం నేపథ్యంగా చూపకుండా.. కథలోనే కీలకమైన భాగంగా దర్శకుడు ఉపయోగించారు. ఈ సినిమాలో సుమన్‌ అనే వివాహిత మహిళ ప్రధాన పాత్ర. పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆమె.. గోంధల్‌ కళాకారుడు సాహెబాతో సంబంధం, తన భర్త కుటుంబంలోని వ్యక్తులతో ఉన్న పరిస్థితుల మధ్య బయటపడేందుకు ఒక ప్రమాదకరమైన పథకం వేస్తుంది. ఆ తర్వాత కథ ప్రేమ, కోరిక, మోసం, హత్య, తప్పించుకునే ప్రయత్నాల చుట్టూ ఉత్కంఠగా సాగుతుంది. ‘గోంధల్‌’లో కిశోర్‌ కదమ్‌, ఇషితా దేశ్‌ముఖ్‌, యోగేశ్‌ సోహోని, నిషాద్‌ భోయిర్‌, అనుజ్‌ ప్రభు, సురేశ్‌ విశ్వకర్మ, విఠల్‌ కాలే తదితరులు నటించారు. సినిమాకు సంతోష్‌ దవాఖర్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించారు. ‘గోంధల్‌’కు ఆస్కార్‌ ఎంట్రీ రావడం ఒక్కసారిగా జరిగిన విషయం కాదు. ఈ సినిమా అంతకుముందే పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI)లో సంతోష్‌ దవాఖర్‌కు బెస్ట్‌ డైరెక్టర్‌ విభాగంలో సిల్వర్‌ పీకాక్‌ అవార్డు లభించింది. బెంగళూరు, పుణే తదితర ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ఈ సినిమాకు గుర్తింపు వచ్చింది. ఇక ‘గోంధల్‌’ ఇప్పుడు నేరుగా ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన సినిమా కాదు. ఇది భారత్‌ అధికారికంగా పంపిన ఎంట్రీ మాత్రమే. 99వ అకాడమీ అవార్డ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో తదుపరి దశలో షార్ట్‌లిస్ట్‌ ప్రక్రియ ఉంటుంది. 99వ ఆస్కార్‌ వేడుక 2027 మార్చి 14న లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News