Kaizer News

జింకలగూడెంలో ఉద్రిక్త వాతావరణం

జింకలగూడెంలో ఉద్రిక్త వాతావరణం

· State - Telangana · ntnews.com

మౌలానా మృతితో నిందితుడి ఇంటికి నిప్పు – మౌలానా మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన – భారీగా మోహరించిన పోలీసులు బూర్గంపహాడ్, ఆగస్టు 29 : హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టగా ఆ వ్యక్తి ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి నిప్పంటించడంతో ఉద్రిక్త వాతావరణం నెల‌కొన్న సంఘటన బూర్గంప‌హాడ్ మండల పరిధిలోని జింకలగూడెంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 23న జింకలగూడెం గ్రామానికి చెందిన షేక్ మౌలానా (38)ను అదే గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా తనకు ఉన్న స్కార్పియో కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఆ ఘటనలో మౌలాలి తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఖమ్మం ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయితే పరిస్థితి విషమించి శనివారం తెల్లవారుజామున మౌలానా మృతి చెందాడు. మృతుడికి భార్య షాబీరాబేగం, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కోపోద్రిక్తులై మౌలానా మరణానికి కారణమైన ఇస్మాయిల్ ఇంటిపైకి దూసుకువెళ్లి నిప్పంటించారు. ఇంట్లో సామ‌గ్రిని ధ్వంసం చేశారు. అప్పటికే ఇస్మాయిల్ ఇంట్లో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా ఇస్మాయిల్ బావ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మేడా ప్రసాద్ పోలీసు సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇంటికి నిప్పంటించగా మంటలను అదుపు చేయించారు. శనివారం మధ్యాహ్నానికి మౌలానా మృతదేహం అంబులెన్స్‌లో జింకలగూడెం గ్రామం చేరుకుంది. మృతదేహాన్ని నేరుగా నిందితుడి ఇంటికి తీసుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు వారిని నెట్టివేసి మృతదేహం ఉన్న అంబులెన్స్‌ను నేరుగా ఇస్మాయిల్ ఇంటి ఆరుబయటకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు మౌలానా మృతదేహాన్ని అక్కడ ఉంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సంఘటనా ప్రదేశం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడి కుటుంబంపై ఆగ్రహంగా ఉన్న కుటుంబీకులు, బంధువుల నుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరుగురు సీఐలతో పాటు 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులతో డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామని స‌ద‌రు నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ పెద్దను కోల్పోయామని, దీనికి కారణమైన నిందితుడు, కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించాలని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహంతో ఆందోళనను కొనసాగించారు

Original source: ntnews.com
Read more on Kaizer News