సీఎం, మంత్రుల చేతుల మీదుగా టీఆర్ లేకుండానే రెట్రోఫిట్టెడ్ వెహికిల్స్ పంపిణీ రిజిస్ట్రేషన్లు కాక లబ్ధిదారులకు తిప్పలు 8 నెలలుగా ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ చక్కర్లు దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కార్ మరో ధోకా హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ):రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సబ్సిడీ వాహనాల పంపిణీలో నిబంధనలకు నీళ్లొదిలింది. వాహన భద్రతా ప్రమాణాలను ధ్రువీకరించే ఏఆర్‌ఏఐ (ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫికేషన్ లేకుండానే రెట్రోఫిట్టెడ్ వాహనాలు పంపిణీ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ వాహనాలకు టెంపరరీ, పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు చేసేందుకు రవాణా శాఖ నిరాకరిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో సుమారు 1,000 మంది లబ్ధిదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరిగితిరిగి విసిగి వేశారిపోతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దివ్యాంగులకు పరికరాలు, వాహనాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం.. 2025 మార్చిలో దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మార్గదర్శకాల రూపొందించడంలో తీవ్ర జాప్యంచేసింది. దివ్యాంగుల హక్కుల సంఘాల ఒత్తిళ్లతో ఆలస్యంగానైనా పంపిణీకి ఉపక్రమించింది. ఈ క్రమంలో 2026 జనవరి 12న హైదరాబాద్ ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వాహనాల పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు రెట్రోఫిట్టెడ్ వాహనాలు పంపిణీ చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను అందజేశారు. ఆ తర్వాత ఆర్టీఏ ఆఫీసులకు వెళ్తే రిజిస్ట్రేషన్ చేయడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. వాహన భద్రతా ప్రమాణాలను ధ్రువీకరించే ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్ లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిచి దివ్యాంగులకు వాహనాలు, ఎయిడ్స్ పంపిణీ చేశారు. నాడు 70 శాతం టెండర్లు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించేవారు. అల్మికో (అర్టిఫీషియల్ లింబ్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రెట్రోఫిట్టెడ్ వాహనాలు, ఇతర పరికరాలు అందించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీసీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చివేశారు. నిబంధనల ప్రకారం అల్మికో ఎంప్యానెల్డ్ కంపెనీ అయి ఉండి, ఏఆర్‌ఏఐ అప్రూవ్డ్ రెట్రో ఫిట్ కిట్ కలిగిన, జీఎస్టీ, ఐఎస్‌వో సర్టిఫికెట్ ఉన్న, టెండర్ విలువలో 2 శాతం ఈఎండీ ఉన్న కంపెనీలకే టెండ ర్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ అనుయాయులకు చెందిన ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టిందని దివ్యాంగుల యూనియన్ నేతలే ఆరోపిస్తున్నారు. కేంద్రం సూచించిన మేరకు వాహన భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్తున్నారు. దీంతోనే దివ్యాంగులకు పంపిణీ చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడంలేదని మండిపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి వాహన రిజిస్ట్రేషన్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ లేకుండా దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేసిన సీఎం, మంత్రులపై చర్యలు తీసుకోవాలని తె