అధ్యాపకులపై ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: బీఆర్‌ఎస్‌వీ నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థి కాలూరి భరత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అతని కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ జిల్లా సమన్వయకర్త అతినారపు విష్ణుసాగర్ మాట్లాడుతూ భరత్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిందని, కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. భరత్‌ను అధ్యాపకులు వేధించారంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విష్ణుసాగర్ డిమాండ్ చేశారు. విద్యార్థిని హాస్టల్‌లో నిర్బంధిస్తామని, టీసీ ఇచ్చి పంపిస్తామని, హాల్‌టికెట్ ఇవ్వకుండా చేస్తామని, ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయిస్తామని ఆర్‌సీఓతో పాటు ప్రిన్సిపాల్ బెదిరించారని ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థి మరణానికి సంబంధించి ఎవరి పాత్ర ఉన్నా రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఆధారాల ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధ్యాపకులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులను విధులకు దూరంగా ఉంచి సస్పెండ్ చేయాలని కోరారు. గురుకుల కళాశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, వేధింపులు, ఒత్తిళ్లను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని విష్ణుసాగర్ కోరారు. ఒక విద్యార్థి ప్రాణం కోల్పోయిన ఘటనను వ్యక్తిగత అంశంగా కాకుండా విద్యార్థుల భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయంగా పరిగణించాలని అన్నారు. భరత్ కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థులకు రక్షణ కల్పించాలని, విద్యార్థులపై వేధింపులను అరికట్టి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు