ముత్తుకూరు, ఆంధ్రప్రభ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం కలకలం రేగింది. జడ్పీ హైస్కూల్–మామిడిపూడి రహదారి మార్గంలో బీసీ కాలనీ సాయిబాబా మందిరం సమీపంలోని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సాగునీటి కాలువలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం బయటపడింది. కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుల సహకారంతో మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడు ఎవరు, కాలువలోకి ఎలా వచ్చాడు, మృతికి గల కారణాలేమిటనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది