కర్నూలు: నగరంలో రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు వాహనదారుల భద్రతకు ముప్పు కలిగించడం ఏమాత్రం సబబు కాదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. శనివారం బళ్లారి చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారి సర్వీస్ రహదారిపై ఆక్రమణలను తొలగింపజేశారు. రహదారిపై ఉంచిన టైర్లు, శాశ్వత నిర్మాణాలను వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను వాణిజ్య దుకాణదారులు గ్రహించి, సామాజిక బాధ్యతగా ఆక్రమణలకు పాల్పడకుండా సహకరించాలని సూచించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, వాహనదారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు రహదారులను ఆక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి రాజీ లేకుండా ఆక్రమణలను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం విష్ణు టౌన్‌షిప్‌లో మురుగు కాలువలో తాగునీటి పైప్‌లైన్ మార్పు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని, పందిపాడులో నూతన డ్రెయిన్‌ను పరిశీలించారు. నందికొట్కూరు రోడ్డులోని డిమార్ట్ సమీపంలో పిజిఆర్‌యస్ ఫిర్యాదు ప్రాంతాన్ని, ముజఫర్ నగర్ నూతన రైతు బజార్‌ను పరిశీలించి, డస్ట్ బిన్‌లు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సెట్కూర్ కార్యాలయం వద్దనున్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఈలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎంజల్ ప్రణీత, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు