Kaizer News

Kalyandurgam: వర్షాల కోసం ఊరు ఖాళీ చేసి.. వనభోజనాల

Kalyandurgam: వర్షాల కోసం ఊరు ఖాళీ చేసి.. వనభోజనాలు చేసిన గ్రామస్తులు!

· State - Telangana · hmtvlive.com

Kalyandurgam: వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఓ గ్రామం మొత్తం గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్లి వనభోజనాలు చేయడం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో శనివారం ఈ వినూత్న కార్యక్రమం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సమేతంగా గ్రామం బయటకు వెళ్లి వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో బోరంపల్లి గ్రామంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వర్షాలు లేక బోరుబావుల్లో నీటి మట్టాలు అడుగంటిపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ గ్రామస్తులు తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని పాటించారు. గ్రామస్తుల నమ్మకం ప్రకారం.. గ్రామంలోని ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి గ్రామం వెలుపలికి వెళ్లి వనభోజనాలు చేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని చెబుతున్నారు. గతంలోనూ ఇదే విధంగా గ్రామం విడిచి వనభోజనాలకు వెళ్లిన సందర్భాల్లో వర్షాలు కురిసిన సంఘటనలు ఉన్నాయని 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు గుర్తుచేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఒకచోట చేరారు. గ్రామం బయట వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. సంప్రదాయంగా వస్తున్న నమ్మకాన్ని కొనసాగిస్తూ వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న కరువు పరిస్థితులపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు చేతికందక పెట్టుబడులు సైతం తిరిగి రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పశువులకు కూడా నీరు, మేత కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. వర్షాలు కురవకపోతే వ్యవసాయం సాగక గ్రామాలను విడిచి కుటుంబాలతో సహా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News