Shorts సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ వ్యవహారంలో న్యాయం, ప్రజాస్వామ్యం గెలిచాయని అన్నారు. గతంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు అన్యాయమని, అది సరికాదని తాజా కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తరహా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు శాశ్వతంగా అన్యాయం చేసేలా ఉన్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు కింద ఎలాంటి లిఫ్టులు ఆన్ చేయకుండా 83 టీఎంసీల నీటిని ఎలా వినియోగించారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఆంధ్రా పాలకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చదువుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధిస్తే, కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉత్తమ్ తన వ్యాఖ్యలను సభలో ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు