Kaizer News

గిరిజన యువతకు న్యాయం చేయాలి..

గిరిజన యువతకు న్యాయం చేయాలి..

· State - Telangana · prabhanews.com

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, గిరిజన ఎమ్మెల్యేలు వైరా, ఆంధ్రప్రభ : గిరిజన ప్రాంతాల్లోని స్థానిక యువతకు పోలీస్‌ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించేందుకు 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, ఇతర గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. గిరిజన ప్రాంతాల భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్థానిక యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోలీస్‌ ఉద్యోగం స్థానిక యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు, పోలీస్‌ శాఖలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న యువతకు అవకాశం కల్పించినట్లు అవుతుందని తెలిపారు. స్థానిక యువత పోలీస్‌ వ్యవస్థలో భాగస్వాములైతే ప్రజలకు, పోలీసులకు మధ్య మరింత విశ్వాసపూర్వక సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. గతంలో గిరిజన ప్రాంతాల యువత ఎదుర్కొన్న ఉద్యోగ అవకాశాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని 75 శాతం రిజర్వేషన్‌ అమలుకు అవసరమైన రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గిరిజన యువతకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News