Kaizer News

వర్సిటీ రిక్రూట్‌మెంట్‌కు ఏప్రిల్లోపే గడువు

వర్సిటీ రిక్రూట్‌మెంట్‌కు ఏప్రిల్లోపే గడువు

· State - Telangana · ntnews.com

ఆ తర్వాత భర్తీకి నో చాన్స్‌.. ముగియనున్న వీసీల పదవీకాలం మళ్లీ ఖాళీల వివరాల సేకరణ.. జీవో-21లో స్వల్ప మార్పులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ) : విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2027 ఏప్రిల్‌యే డెడ్‌లైనా..? అంతలోపే నోటిఫికేషన్లు విడుదల చేయాల్సిందేనా..? ఆ తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఉపయోగముండదా..? అంటే అవుననే అంటున్నారు విద్యారంగ నిపుణులు. వర్సిటీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు ఇదే గడువుగా పేర్కొంటున్నారు. ఆ తర్వాత చేపట్టినా అడుగులు ముందుకు పడటం కష్టమంటున్నారు. వీసీల పదవీకాలం చివరి దశలో.. అంటే ఆరు మాసాల ముందు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దన్న సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. గతంలోని వీసీలు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. 2024 అక్టోబర్‌ 18న రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్‌ వీసీలను నియమించారు. ఈ లెక్కన వీసీల పదవీ కాలం 2027 అక్టోబర్‌తో ముగుస్తుంది. ఆరు నెలల ముందు అంటే.. 2027 ఏప్రిల్‌లోపు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుందని విద్యారంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ప్ర భుత్వం జారీ చేసిన జీవో-21 కూడా నియామక ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానంలో అకాడమిక్‌/రీసెర్చ్‌ పనితీరుకు 50 మారులు, విషయ పరిజ్ఞానం-బోధనా నైపుణ్యానికి 30 మారులు, ఇంటర్వ్యూకు 20 మారులను సర్కార్‌ నిర్దేశించింది. జీవోలో ఇచ్చిన వెయిటేజీ యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొందరు నిరుద్యోగ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిబంధనలు మార్చకపోతే న్యాయపోరాటానికి వెళ్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం-అభ్యర్థుల మధ్య అనిశ్చితి నెలకొన్నది. ఫలితంగా జీవో వెలువడి ఏడాది దాటినా నియామక ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇటీవలే ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో సమీక్ష నిర్వహించింది. నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే జీవో-21లో మార్పులు అవసరమని పలువురు వీసీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో జీవో-21లో పూర్తిస్థాయి మార్పులు కాకుండా స్వల్ప సవరణలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. యూనివర్సిటీలవారీగా ఖాళీల వివరాలను అధికారులు మళ్లీ సేకరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో 1,061 పోస్టులు భర్తీచేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కాకుండా.. 460 పోస్టులు భర్తీచేయవచ్చని ఉన్నత విద్యామండలి సర్కార్‌కు నివేదిక సమర్పించింది. ఇవన్నీ ఉండగానే మళ్లీ ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, ఖాళీల వివరాలు వేర్వేరుగా సేకరిస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టులతోపాటే సమాంతరంగా బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీచేయనున్నట్టు తెలిసింది

Original source: ntnews.com
Read more on Kaizer News