Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కి మహారాష్ట్ర మూలాలున్న నీలా విఖే పాటిల్ ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె, 349 మంది సభ్యులుండే స్వీడిష్ పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ (Riksdag) లోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి స్వల్ప మెజారిటీ రావడంతో నీలా ఈ విజయాన్ని అందుకున్నారు. నీలా వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఆమె పుట్టింది స్వీడన్‌లోనే అయినా, చిన్నతనమంతా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోనే గడిచింది. ఆ తర్వాత స్వీడన్ వెళ్లిన నీలా, అక్కడే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నీలా కుటుంబానికి మహారాష్ట్ర రాజకీయాలు, విద్య, సహకార రంగాలలో గొప్ప చరిత్ర ఉంది. ఆమె తండ్రి అశోక్ విఖే పాటిల్ ప్రముఖ విద్యావేత్త కాగా, తాతయ్య బాలాసాహెబ్ విఖే పాటిల్ కేంద్ర మాజీ మంత్రి. ఇక ఆమె బాబాయి రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాదు, ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ ఈమెకి ముత్తాత అవుతారు