కాపువాడకు చెందిన శ్రీరాముల కవితగా నిర్ధారణ.. సీసీటీవీ, పోస్టుమార్టం ఆధారంగా దర్యాప్తు కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : కరీంనగర్ రూరల్ పరిధిలోని బొమ్మకల్‌లో కళ్యాణి గార్డెన్స్ సమీపంలో గురువారం కాలిపోయిన స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్‌రెడ్డి తెలిపారు. మృతురాలు కాపువాడకు చెందిన శ్రీరాముల కవిత (47)గా గుర్తించారు. ఆమె తండ్రి శ్రీరాముల రాంచంద్రం రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కవిత భర్త రమేశ్ దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ 2014లో మృతి చెందారు. అనంతరం కారుణ్య నియామకం కింద కవితకు అటెండర్ ఉద్యోగం లభించింది. ప్రస్తుతం మంకమ్మతోట వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవిత తల్లి ఇంటికి వచ్చి, సుమారు 10 నిమిషాల తర్వాత బ్యాగ్ తీసుకుని కళ్యాణి గార్డెన్స్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె డబ్బులు, ఫోన్‌ను తల్లి ఇంట్లోనే వదిలివెళ్లినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కవిత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్నారు. గతంలో పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఒకసారి బావిలో దూకేందుకు ప్రయత్నించగా తండ్రి కాపాడారని, మరోసారి పారాసిటమాల్ మాత్రలు మింగడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత ఘటనలోనూ ఆమెకు తానే నిప్పంటించుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు