Kaizer News

పర్యాటక ప్రగతికి కొత్త ఊపు

పర్యాటక ప్రగతికి కొత్త ఊపు

· State - Telangana · prabhanews.com

మంత్రి కందుల దుర్గేష్‌తో నూతన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ భేటీ విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగ అభివృద్ధికి మరింత వేగం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి షంషీర్‌ సింగ్‌ రావత్‌ శుక్రవారం పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో నూతన బాధ్యతలు స్వీకరించిన రావత్‌కు మంత్రి దుర్గేష్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, సాంస్కృతిక రంగ పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు పర్యాటక రంగానికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. నూతన పర్యాటక విధానం అమలు, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలు, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని దేశ, విదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దుర్గేష్‌ పేర్కొన్నారు. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత దోహదపడేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మంత్రి కందుల దుర్గేష్‌ నాయకత్వంలో పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తానని ఎస్‌.ఎస్‌. రావత్‌ తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News