Kaizer News

తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కుటుంబంతో కలిపి

తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ

· National - India · ntnews.com

చండీగఢ్‌: ఒక వృద్ధుడు తీర్థయాత్రకు వెళ్లి తప్పిపోయాడు. మతిమరుపు ఉన్న ఆయన రైలులో మరో రాష్ట్రానికి చేరుకున్నాడు. ఆ వృద్ధుడి దీనస్థితిని గమనించిన ఒక వ్యక్తి సహాయానికి ముందుకు వచ్చాడు. చాట్‌జీపీటీ ద్వారా ఆయన గ్రామం ఎక్కడ ఉన్నదో తెలుసుకున్నాడు. ఆ వృద్ధుడ్ని స్వయంగా తీసుకెళ్లి కుటుంబానికి అప్పగించాడు. (ChatGPT Reunite Man With Family) పంజాబ్‌లోని లూధియానా జిల్లా ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామానికి చెందిన చమన్ లాల్, ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం’ కింద హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించేందుకు సెప్టెంబర్ 11న అమృత్‌సర్‌ చేరుకున్నాడు. కాగా, మతిమరుపు ఉన్న ఆ వృద్ధుడు తన బృందం నుంచి విడిపోయాడు. అమృత్‌సర్‌ రైల్వే స్టేషన్ చేరుకున్న ఆయన బీహార్ వెళ్లే రైలు ఎక్కాడు. 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి గయకు చేరుకున్నాడు. అయితే అక్కడి రైల్వే స్టేషన్‌లో దీనస్థితిలో ఉన్న చమన్ లాల్‌ను స్థానికుడైన నీరజ్ అనే వ్యక్తి గమనించాడు. ఆ వృద్ధుడు ఆందోళనతో, ఆకలితో ఉన్నట్లు కనిపించడంతో తన ఇంటికి తీసుకెళ్లాడు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న నీరజ్‌, ఆ వృద్ధుడికి ఆహారం ఇచ్చి నాలుగు రోజుల పాటు ఆశ్రయం కల్పించాడు. మరోవైపు చమన్‌ లాల్‌ నుంచి వివరాలు తెలుసుకునేందుకు నీరజ్‌ ప్రయత్నించాడు. అయితే మతిమరుపు ఉన్న ఆ వృద్ధుడు తన గ్రామం పేరు ‘ఫతేగఢ్ గుజ్రాన్’ అని పంజాబీలో చెప్పాడు. నీరజ్‌కు పంజాబ్‌ తెలియకపోవడంతో ఆ గ్రామం ఎక్కడ ఉన్నదో అన్నది ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేశాడు. చివరకు చాట్‌జీపీటీలో వెతకడంతో లూధియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ఆ గ్రామం ఉన్నట్లు తెలుసుకున్నాడు. అయితే వృద్ధుడు, మతిమరుపు ఉన్న చమన్‌ లాల్‌ను ఒంటరిగా పంపడానికి నీరజ్‌ మనసు అంగీకరించలేదు. దీంతో ఆయనను తీసుకుని గయా నుంచి లూధియానాకు స్వయంగా రైలులో ప్రయాణమయ్యాడు. అక్కడి నుంచి మచ్చివారాకు వారు చేరుకున్నాడు. చమన్‌ లాల్‌ను ఎవరైనా గుర్తుపడతారేమోనన్న ఆశతో కనిపించినవారికి ఆయన ఫొటో చూపించాడు. చివరకు ఆ ప్రాంతానికి చెందిన మాస్టర్ కృష్ణన్ లాల్ అనే వ్యక్తి ఆ వృద్ధుడిని గుర్తించి ఆయన కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. కాగా, చమన్ లాల్ మనవడు సుఖ్‌చైన్ సింగ్ హుటాహుటిన మచ్చివారాకు చేరుకున్నాడు. ఆ వృద్ధుడు తన తాత అని నీరజ్‌కు చెప్పాడు. ఆయన కోసం తమ కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. నీరజ్‌ను కూడా తమ ఇంటికి తీసుకెళ్లి పూలమాలలతో ఆహ్వానించారు. చమన్‌ లాల్‌ను క్షేమంగా తీసుకువచ్చినందుకు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. నీరజ్‌కు బట్టలు, డబ్బులు బహూకరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News