కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలి: కొండ దేవయ్య పటేల్ నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ పట్టణంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షత వహించారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపుల జనాభాను తక్కువగా చూపిస్తూ గణాంకాలు నమోదు చేశారని అన్నారు. వాస్తవంగా మున్నూరు కాపుల జనాభా కోటి మందికి పైగా ఉంటుందని, అయితే అధికారిక గణాంకాల్లో 20 లక్షల లోపుగా చూపించడం వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు. మున్నూరు కాపుల వాస్తవ జనాభా వివరాలను ఆధారాలతో ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. మున్నూరు కాపు కులానికి చెందిన వారు పుట్టిన శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు కుటుంబ సభ్యుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. తద్వారా మున్నూరు కాపుల వాస్తవ జనాభాకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి ఆధారాలతో తెలియజేసే అవకాశం ఉంటుందని వివరించారు. మున్నూరు కాపుల ఐక్యత, సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరంపై పలువురు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, నిర్మల్ ఎఫ్‌ఎస్‌సీఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, గండి రామన్న దత్త సాయి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే శేఖర్, నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆకుల హరీష్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, వివిధ వార్డులు, కాలనీలకు చెందిన సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు