నందికొట్కూరు, ఆంధ్రప్రభ: శ్రీశైలం నీటిముంపు నిర్వాసిత కుటుంబాలకు జీవో నెం.98 ప్రకారం ఇంటికొక ఉద్యోగం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ సమస్యను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఆదివారం నందికొట్కూరులో 158 రోజులుగా కొనసాగుతున్న శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జై కిసాన్ పార్క్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. 1986లో ఎన్టీఆర్ జారీ చేసిన జీవో 98 ప్రకారం ఇంకా 674 మందికి ఉద్యోగాలు రావాల్సి ఉందని తెలిపారు. నాలుగు దశాబ్దాలు గడిచినా జీవో అమలు కాకపోవడం బాధాకరమన్నారు. జీవో 98 అమలయ్యే వరకు నిరుద్యోగులు చేపట్టే ప్రతి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని వెంకటస్వామి ప్రకటించారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సమస్యను కూడా పార్లమెంటులో ప్రస్తావించి నిర్వాసిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు