Kaizer News

Mancherial: గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచ

Mancherial: గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి: కలెక్టర్ కుమార్ దీపక్!

· State - Telangana · hmtvlive.com

Shorts మంచిర్యాల, సెప్టెంబర్ 18: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, వ్యవసాయ అధికారి సురేఖతో పాటు పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమృద్ధి, స్థితిస్థాపక ప్రణాళికపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, ఆదాయ వనరులు, మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి మెరుగుపడేలా గ్రామ సమృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామాల అవసరాలు, సమస్యలను సమగ్రంగా గుర్తించి, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర రంగాల్లోని అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి, వాటిని సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని అన్నారు. గ్రామ సమృద్ధి ప్రణాళిక, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల సమ్మిళితంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామసభల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను మండల, జిల్లా స్థాయిలో సమన్వయం చేసి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులు, వనరులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రణాళికల అమలు, పురోగతిని జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News