రూ.6 వేల పెన్షన్ హామీ ఏమైంది?.. ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ అంటూ విమర్శ హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యంగా దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం బాకీ పడిన మొత్తాన్ని చెల్లించడంతో పాటు రూ.6 వేల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన దివ్యాంగుల సమరశంఖారావం, పటాన్‌చెరులో జరిగిన 22ఏ బాధితుల సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులు సమస్యల వలయంలో చిక్కుకున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో వేలాది మంది దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.4,016కు పెంచినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రూ.6 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారని, అయితే ఇంతకాలం గడిచినా ఆ హామీ నెరవేరలేదని ప్రశ్నించారు. ఎన్నికల హామీ ప్రకారం ఒక్కో దివ్యాంగుడికి రూ.66 వేల మేర పెన్షన్ బాకీ పడిందని ఆయన ఆరోపించారు. దివ్యాంగుల సంక్షేమానికి గత ప్రభుత్వంలో భారీగా నిధులు ఖర్చు చేశామని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి చర్యలు చేపట్టామని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితా అంశంపైనా హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. నిషేధిత జాబితా నుంచి భూములను పూర్తిస్థాయిలో తొలగించే వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. 22ఏ అంశంలో ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. పటాన్‌చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. ప్రజల భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సహా అనేక వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు