బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని రెండో వార్డు పాలిటెక్నిక్ ఏరియా ఇందిరమ్మ కాలనీలో పదిహేనేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్ల నిర్మాణ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలనీలో నూతన రోడ్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేశ్, స్థానిక కౌన్సిలర్ నిచ్చకోల వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, గత పాలకులు విస్మరించిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్థానికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని కౌన్సిలర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సింగ్, కౌన్సిలర్లు మత్తమారి రాయమల్లు, ఇప్ప కుమారస్వామి, పోలు ఉమా శ్రీనివాస్, కొక్కుల రామ్మూర్తి, సీనియర్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు