ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో మథుర (లభాన్) సమాజానికి చెందిన మహిళలు పవిత్రమైన ‘తీజ్’ వేడుకలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. పండుగలో భాగంగా గ్రామానికి చెందిన యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా స్థానిక వాగు వద్దకు తరలివెళ్లారు. అక్కడ సహజసిద్ధమైన పద్ధతిలో వాగు తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నల్లమట్టిని సేకరించి గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వెదురు బుట్టల్లో ఆ మట్టిని నింపి, అందులో గోధుమ విత్తనాలను నాటారు. రాబోయే తొమ్మిది రోజుల పాటు గోధుమ మొలకలకు ప్రతిరోజూ నీరు పోస్తూ భక్తిశ్రద్ధలతో సంరక్షించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ ప్రకృతిని పూజిస్తూ తమ కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ తీజ్ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే తొమ్మిది రోజుల పాటు గ్రామంలో జానపద పాటలు, సాంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు