Kaizer News

పంచాయతీ ట్రాక్టర్లకు బీమా ఎప్పుడూ?

పంచాయతీ ట్రాక్టర్లకు బీమా ఎప్పుడూ?

· State - Telangana · prabhanews.com

హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర అవసరాల కోసం గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ట్రాక్టర్లను గ్రామాల్లో చెత్త సేకరణ, నర్సరీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలకు నీరు పట్టడం వంటి పనులకు వినియోగిస్తున్నారు. డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఈ వాహనాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రమాదాలు జరిగితే వారికి, వాహనాలకు సరైన భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్రాక్టర్లకు బీమా కల్పించే అంశాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయతీల్లో సుమారు ఆరేళ్ల క్రితం కొనుగోలు చేసిన పలు ట్రాక్టర్లకు గత మూడేళ్లుగా బీమా రెన్యువల్ చేయలేదని తెలుస్తోంది. అప్పట్లో పాలకవర్గాలు లేకపోవడం, నిధుల కొరత వంటి కారణాలతో ఈ అంశం పక్కనపడినట్లు సమాచారం. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు, సంబంధిత శాఖ అధికారులు కూడా బీమా రెన్యువల్‌పై దృష్టి సారించాలని గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు, కొన్ని గ్రామపంచాయతీల ట్రాక్టర్లకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగితే భారీ ఆర్థిక నష్టంతో పాటు బాధితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అన్ని పంచాయతీ ట్రాక్టర్లకు తక్షణమే రిజిస్ట్రేషన్, బీమా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News