Madhav August 30, 2026 గురువు-శిష్యుడు, మధ్యలో ఏఐ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక తరగతి గది. బోర్డు మీద ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న రాశారు. అది లెక్కలు కావచ్చు, చరిత్ర కావచ్చు, వ్యాకరణం కావచ్చు… ఏదైనా కావచ్చు. విద్యార్థుల వైపు తిరిగి ఆ ప్రశ్నను అడగబోయారు. ప్రశ్న పూర్తిగా చదవకముందే దాదాపు చాలామంది నుంచి సమాధానాలు వచ్చేశాయి. ఆశ్చర్యకరంగా అందరూ చెప్పింది దాదాపు ఒకే సమాధానం. మాటల్లో కాస్త అటూ ఇటూ తేడా అంతే. ఇదే దృశ్యం పాతికేళ్ల క్రితం జరిగి ఉంటే ఆ ఉపాధ్యాయుడు ఎంతో ఆనందపడేవారేమో. “నా విద్యార్థులు ఎంత తెలివైనవారో!” అని గర్వపడేవారేమో. ఉపాధ్యాయుడు చిరునవ్వుతో ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగారు… “సరే… నువ్వు చెప్పిన సమాధానం సరైనదే. కానీ అది ఎందుకు సరైనదో చెప్పగలవా? బోర్డు మీద చేసి చూపించు.” అంతే… కాసేపటి క్రితం ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పిన ఆ తెలివైన విద్యార్థి ముఖం తెల్లబోయింది. ఆ సమాధానం వారి సొంత ఆలోచన నుంచి వచ్చింది కాదు. వారు నేర్చుకున్న పరిజ్ఞానం నుంచి పుట్టింది కాదు. చేతిలో ఉన్న కృత్రిమ మేధ సాధనం ఇచ్చిన సమాధానాన్ని చదివి చెప్పారంతే. ఒకప్పుడు సందేహం వస్తే గురువు దగ్గరకు వెళ్లి అడిగేవారు. గురుముఖంగా విషయాన్ని తెలుసుకునేవారు. గ్రంథాలయాల్లో పుస్తకాల మధ్య గంటల తరబడి వెతికేవారు. ఒక విషయాన్ని వెతుకుతూ మరో పది కొత్త విషయాలు తెలుసుకునేవారు. ఆ తర్వాత ఏ ప్రశ్న అడిగినా వెతికి చూపించే గూగుల్ యుగం వచ్చింది. సమాచారాన్ని కనుగొనడం సులభమైంది. ఇప్పుడు కృత్రిమ మేధ రావడంతో వెతికే శ్రమ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చిన్న సందేహం వచ్చినా… పెద్ద సమస్య ఎదురైనా… ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్నా… వృత్తి, చదువు, ఉద్యోగం, జీవితం గురించి సలహా కావాలన్నా… చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది కృత్రిమ మేధే. ప్రశ్న అడిగితే క్షణాల్లో సమాధానం వస్తోంది. కానీ ఆ సమాధానం సరైనదా? దానికి ఆధారం ఏమిటి? అది మన పరిస్థితికి వర్తిస్తుందా? అనే ప్రశ్నలు అడిగే అలవాటు మాత్రం తగ్గిపోతోంది. గురువును అడిగితే ఆయన తన అనుభవం, అధ్యయనం, అవగాహన నుంచి విషయాన్ని వివరిస్తారు. గ్రంథాలయంలో పుస్తకాలు వెతికితే మనకు కావాల్సిన జవాబుతో పాటు మరెన్నో విషయాలు తెలుస్తాయి. ఆ అన్వేషణలోనే ఆలోచన పెరుగుతుంది. సందేహాలు పుడతాయి. వాటికి సమాధానాలు వెతికే క్రమంలోనే మేధ పదునెక్కుతుంది. కానీ, ఎలాంటి సాధన లేకుండా, శోధన లేకుండా, ప్రశ్న అడిగిన క్షణంలోనే సమాధానం దొరికిపోతే… ఆ జవాబు విలువ ఏమిటి? కృత్రిమ మేధను తయారు చేసింది మనిషే. కానీ దాన్ని సృష్టించిన మనిషే చివరకు దానిపై పూర్తిగా ఆధారపడితే… రాబోయే తరాల మేధో వికాసం ఏమవుతుంది? కృత్రిమ మేధ సాధనాలు కూడా తప్పులు చేయవచ్చని, వాటి సమాధానాలను ధ్రువీకరించుకోవాలని స్వయంగా ఆ సేవల నిర్వాహకులే సూచిస్తుంటారు. అలాంటప్పుడు వాటి సమాధానాలను ఎలాంటి పరిశీలన లేకుండా పూర్తిగా నమ్మడం ఎంతవరకు సమంజసం? కృత్రిమ మేధ ఒక గొప్ప సాంకేతిక విప్లవం అనడంలో సందేహం లేదు. అది మన పనిని వేగవంతం చేయగలదు. సమాచారాన్ని క్రమబద్ధీకరించగలదు. కొత్త ఆలోచనలకు దారి చూపగలదు. కానీ అసలు మేధకు అది పూర్తి ప్రత్యామ్నాయమా? కృత్రిమ మేధ ఒక సాధనం కావాలి. మన ఆలోచనకు సహాయకం క