Bharath August 30, 2026 ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నటి రష్మిక మందన్న కొంతకాలంగా సినిమా షూటింగ్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆమె నటిస్తున్న‘మైసా’ పాట చిత్రికరణ సమయంలో ఆమె కాలికి గాయం కావడంతో గత కొద్ది రోజులుగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తిసుకుంటున్నారు రష్మిక. అయితే తాజాగా తన ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు రష్మిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గాయం నుంచి కోలుకునే సమయంలో ఇంట్లో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి గడిపిన క్షణాలను రష్మిక అభిమానులతో పంచుకున్నారు. తాను గడిపిన సరదా సందర్భాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి క్యాప్సన్ గా త్వరలోనే తిరిగి పని ప్రారంభించనున్నా.. ఈ విరామ సమయంలో ఇంట్లో గడిపిన సమయాన్ని మాత్రం మిస్ అవుతానని ఆమె పోస్ట్ చేశారు. తన గాయం గురించి రష్మిక గతంలోనే అభిమానులకు వివరించారు. ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ షూట్ చేస్తున్న సమయంలో కుడి తుంటి భాగంలోని ఓ టెండన్‌కు గాయం అయినట్లు రష్మిక తెలిపారు. దీంతో కొంతకాలం పాటు వర్కౌట్స్, రన్నింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. తన గాయం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. రష్మిక ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో మైసా ఒకటి. గోండ్ తెగల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె గోండ్ మహిళగా కనిపించనున్నారు. ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా, ఇందులో మరింత ధైర్యమైన, శారీరకంగా కఠినమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ డ్రామా బ్రిటిష్ పాలన కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. భారత చరిత్రలోని అంతగా వెలుగులోకి రాని కొన్ని ఘటనల స్ఫూర్తితో ఈ కథను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది