అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మురం చేసింది. తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాజాగా సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లాను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద సెప్టెంబరు 17న అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి మొత్తం విలువ సుమారు రూ. 230 కోట్లుగా దర్యాప్తులో గుర్తించారు. ఇందులో ఒక్క కైలాశ్ చంద్ మంగ్లాకు చెందిన సంస్థ ద్వారానే రూ. 96 కోట్ల విలువైన కల్తీ నెయ్యి తయారై సరఫరా అయినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, కైలాశ్ చంద్ మంగ్లా కల్తీ పదార్థాల సేకరణలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, తన ఫ్యాక్టరీలోనే ఈ నాసిరకం నెయ్యిని తయారు చేశాడు. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ వంటి చౌకనూనెలను ఉపయోగించి కల్తీకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పాటు నెయ్యి చిక్కదనం, సువాసన, రూపం మారేందుకు ఎంజీ-90, మోనోగ్లిజరైడ్స్, మైవాసెట్ సాఫ్ట్ 400, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను కూడా కలపడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ రసాయన మిశ్రమంతో తయారు చేసిన కృత్రిమ నెయ్యిని అత్యంత నాణ్యమైన 'అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి'గా నమ్మించి టీటీడీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారం నేరుగా కాకుండా శ్రీ వైష్ణవి డెయిరీ, మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి ఇతర సంస్థల ద్వారా సరఫరా జరిగిందని ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కల్తీ నెయ్యి దందా బయటపడకుండా ఉండేందుకు కొనుగోళ్లు, విక్రయాల రికార్డుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. పామాయిల్ వినియోగాన్ని దాచిపెట్టి, అంతా నిజమైన ఆవు నెయ్యి కొనుగోలు చేసినట్లే చూపించేందుకు మంగ్లా తప్పుడు పత్రాలు, నకిలీ రికార్డులు సృష్టించాడు. కాగా, ఇదే కేసులో గతంలో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రమోటర్ విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. విపిన్ జైన్ ఈ నెయ్యి తయారీ, అక్రమ రవాణాలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా కైలాశ్ చంద్ మంగ్లా అరెస్టుతో ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా లబ్ధి పొందిన నెట్‌వర్క్, ఆర్థిక లావాదేవీలు, అనుబంధ సంస్థల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. About the author Shankar Dukanam జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్