Kaizer News

Luxettipet: లక్షెట్టిపేటలో వెంటిలేటర్‌ అంబులెన్స్‌

Luxettipet: లక్షెట్టిపేటలో వెంటిలేటర్‌ అంబులెన్స్‌ ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Luxettipet: ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వెంటిలేటర్‌ సౌకర్యం కలిగిన అంబులెన్స్‌ను శనివారం ప్రారంభించారు. ప్రతిమ ఆసుపత్రి యాజమాన్యం సౌజన్యంతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షెట్టిపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన వైద్యులు, సిబ్బంది, వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ప్రతిమ ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్‌ను అందించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కృషి జరుగుతోందన్నారు. లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత సులభంగా అందించేందుకు ఈ అంబులెన్స్‌ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ అంజలి, వైస్ చైర్‌పర్సన్ రాజేశ్వరి, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యులు, ప్రతిమ ఆసుపత్రి ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News