మద్యం వ్యసనం, పెళ్లి కావడం లేదనే మనస్తాపమే కారణమని ఎస్సై జన్నారం, ఆంధ్రప్రభ : మద్యం వ్యసనానికి బానిసై, పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ ఆదివారం సాయంత్రం తెలిపారు. కలమడుగు గ్రామానికి చెందిన మార్సుకోల అంజి (26) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంపాదించిన డబ్బంతా మద్యం సేవించడానికే ఖర్చు చేస్తూ దుబారాగా తిరిగేవాడని కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ నెల 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజి పురుగుల మందు తాగాడు. విషయాన్ని తన తమ్ముడు వినయ్‌కు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం లక్సెట్టిపేట, మంచిర్యాల ఆసుపత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అంజి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తమ్ముడు వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు