రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని విచారణలు.. ఎన్ని దర్యాప్తులు.. ఎన్ని కమిషన్లు.. ఎన్ని నివేదికలు. అరరే..! ఒక్కటా.. రెండా..! ప్రతి కల్పిత ఆరోపణకూ ఓ విచారణ.. ప్రతి రాజకీయానికీ ప్రత్యర్థిపై ఓ దర్యాప్తు. కాళేశ్వరం నుంచి కరెంట్ వెలుగుల దాకా.. ఫార్ములా ఈ-కార్ రేస్ నుంచి వ్యవసాయ క్షేత్రం దాకా కమిషన్లు, సిట్లు అంటూ ఫీట్లు చేస్తున్నరు. ప్రజాధనంతో సాగుతున్న ఈ ప్రహసనాల పరంపరకు ఇప్పటివరకు చేసిన ఖర్చెంత? తేల్చిన నిజమెంత? ప్రజలకు ఒరిగిందెంత? అధికారం అప్పగిస్తే..! పరిపాలన చేతగాక, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక దొంగాటకు దిగుతున్నరు. కేసీఆర్ మీద భౌతిక ఒత్తిడి పెంచి ఏకంగా అంతమొందించాలనే కుట్రతో పాలక పార్టీ నేతలు వికృత క్రీడకు ఒడిగడుతున్నరు. కానీ అల్పమైన విచారణలు, అర్భకమైన దర్యాప్తులతో కేసీఆర్‌ను ఆపటం ఎవరి తరమైనా అవుతుందా? ఢిల్లీ పీఠాలనే గడగడలాడించి, చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన గండరగండని ఆత్మస్థైర్యాన్ని ఎత్తులు, జిత్తులు ఇసుమంతైనా కదిలించగలవా? కక్షసాధింపు రాజకీయాలు ఆయన దృఢచిత్తాన్ని దెబ్బతీయగలవా? విచారణ అనేది రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించే ఆయుధంగా మారిపోతే? అదే పాలనగా రూపాంతరం చెందితే.. తెలంగాణ గడ్డపై ప్రజా ఉద్యమాలు రగిలి రచ్చకెక్కవా? కోటి ఎకరాల తెలంగాణ మాగాణానికి ప్రాణం పోసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విషం కక్కడమే లక్ష్యంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌ను రంగంలోకి దించారు. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ 2025 జూలైలో నివేదికను సమర్పించింది. ఆ 665 పేజీల నివేదిక తీసుకొచ్చి కేసీఆర్, హరీశ్‌రావుపై అసత్య ఆరోపణలు గుప్పిస్తే, హైకోర్టు డివిజన్ బెంచ్ రేవంత్ సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చింది. కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ నివేదిక నిరర్థకమని తేల్చి చెప్పింది. నివేదికలో ఏమున్నదో అసెంబ్లీలో చర్చించకుండానే, ఆ పరాభవం నుంచి తప్పించుకునేందుకు సీబీఐ దర్యాప్తు అంటూ సరికొత్త రాగం అందుకోవడం ఆరోపణల డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణలో పంటలు ఎండిపోయి, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. అలాంటి చీకటి రోజుల్లో మన రాష్ట్రం మనకొచ్చింది. అటువంటి దయనీయ పరిస్థితులను సమూలంగా మార్చేసి, 24 గంటల నిరంతర వెలుగుల రాష్ట్రంగా నిలబెట్టిన దార్శనికుడు కేసీఆర్. పరిశ్రమలు, వ్యవసాయానికి కరెంట్ కొరత లేకుండా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందాలు చేసుకొని, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మిస్తే.. అందులోనూ అవినీతిని వెతికేందుకు రేవంత్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేసింది. మొదట జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అధ్యక్షతన కమిషన్‌ను రంగంలోకి దింపింది. ఆయన విచారణ మొదలుకాకముందే మీడియా సమావేశాలు పెట్టి ఏకపక్ష వ్యాఖ్యలు చేయడాన్ని కేసీఆర్ సుప్రీంకోర్టు వేదికగా సవాల్ చేశారు. అత్యున్నత న్యాయస్థానమే అసహనం వ్యక్తం చేయడంతో ఆ కమిషన్ తలదించుకొని వైదొలగాల్సి వచ్చింది. ఆ పరాభవాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్‌ను త