రూ.2 కోట్లతోనే తాగునీరు రూ.200 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. శాశ్వత పరిష్కారంపై దృష్టి: ఎమ్మెల్యే యార్లగడ్డ విజయవాడ రూరల్ (వెస్ట్), (ఆంధ్రప్రభ) : విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురం సహా 8 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. శనివారం అంబాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటారు. అంబాపురం సహా విజయవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని యార్లగడ్డ తెలిపారు. ముఖ్యంగా అంబాపురంలో నీటిలో టీడీఎస్ స్థాయి అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 3000కుపైగా టీడీఎస్ ఉండటంతో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కృష్ణా నది సమీపంలో ఉన్నప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందకపోవడం బాధాకరమన్నారు. అంబాపురం సహా సమస్య ఎదుర్కొంటున్న 8 గ్రామాలకు కృష్ణా జలాలు అందించేందుకు అధికారులు రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఉన్న పైపులైన్‌ను అనుసంధానం చేస్తే సుమారు **రూ.2.05 కోట్లతోనే తాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కృష్ణా నది నుంచి నేరుగా కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తే సుమారు రూ.200 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా తక్కువ వ్యయంతోనే శాశ్వత పరిష్కారం చూపించే మార్గాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ చర్యల ద్వారా సుమారు 1.55 లక్షల నుంచి 1.80 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్యను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోనూ చర్చిస్తానని యార్లగడ్డ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు ముందే సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విజయవాడ రూరల్ మండలానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంబాపురం గ్రామంలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఇప్పటికే సుమారు రూ.3.19 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా రూ.5–6 కోట్ల వరకు నిధులు అవసరమని చెప్పారు. దశలవారీగా నిధులు సమకూర్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. క్రికెట్ మైదానం అభివృద్ధి, వాటర్ ట్యాంకు, జన్మభూమి రహదారి తదితర పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అంబాపురం 5వ లైన్‌లోని శృతి నివాస అపార్ట్మెంట్‌లో కరెన్న శ్రీ గణేశా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికుల