నేరడిగొండ, ఆంధ్రప్రభ : ఫైనాన్స్ సంస్థల వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలం సవర్గం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు జాదవ్ అనిల్ (35) ప్రస్తుతం కొరటికల్ బి గ్రామంలో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల ఈఎంఐలు చెల్లించే విషయంలో ఒత్తిడికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు మృతుడి తండ్రి జాదవ్ కిషన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ ఎలక్ట్రానిక్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుని ప్రతి నెల రూ.20 వేల చొప్పున ఈఎంఐ చెల్లించేవాడు. మరో ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.5 లక్షల రుణం తీసుకుని నెలకు రూ.15 వేల చొప్పున ఈఎంఐ కడుతుండేవాడు. అయితే అనిల్ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కావడంతో గత నెల, ఈ నెల ఈఎంఐలు చెల్లించలేకపోయాడని తెలిపారు. ఈఎంఐలు చెల్లించాలంటూ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రోజువారీ విధుల్లో భాగంగా నేరడిగొండ నుంచి సవర్గం గ్రామానికి వెళ్తుండగా గ్రామ శివారులో ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు అనిల్‌ను ఆపి డబ్బులు చెల్లిస్తావా లేదా అంటూ వేధించారని తండ్రి ఆరోపించారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ ఇంటికి వెళ్లి మోనోక్రోటోఫాస్ పురుగుల మందు తాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే అనిల్‌ను ప్రైవేట్ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం