Kaizer News

తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు పెద్దపీట

తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు పెద్దపీట..

· State - Telangana · prabhanews.com

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణతో పాటు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. రైల్వే ప్రమాదాల నివారణకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కవచ్‌ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. బుల్లెట్‌ రైలు తెలంగాణకు వస్తే దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు రూ.27 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌ సామర్థ్యాన్ని 50కి, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ను 150కి పెంచినట్లు వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్‌, రెండు లిఫ్టులు, క్యాంటీన్‌, దివ్యాంగులకు ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. అండర్‌ బ్రిడ్జి సమస్యల పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ రహదారి పనులను సైతం తక్కువ సమయంలో పూర్తి చేస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణలో రైల్వే రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. వికారాబాద్‌ ప్రాంత అభివృద్ధికి రైల్వే అనుసంధానం ఎంతో కీలకమని, ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారి, సికింద్రాబాద్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీజేపీ రాష్ట్ర సెల్‌ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, రమేష్‌, కేఎస్‌. రత్నం, ఎమ్మార్వో లక్ష్మీనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News