స్కార్పియోలో వచ్చిన దుండగులు.. ఏటీఎంను ధ్వంసం చేసి నగదు అపహరణ సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామంలో శనివారం రాత్రి ఎస్బీఐ ఏటీఎంను దుండగులు గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు ఏటీఎంను పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన దుండగులు ఎంతమంది అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏటీఎం చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు, ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. స్కార్పియో వాహనం ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఏటీఎంలో ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైందన్న వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది