కుప్పం అర్బన్, సెప్టెంబర్ 19 (ఆంధ్రప్రభ) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం పర్యటన షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన షెడ్యూల్ ప్రకారం, సీఎం చంద్రబాబు 21వ తేదీ సోమవారం ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని లీలా ప్యాలెస్ నుండి బయలుదేరి హెచ్ఎఎల్ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుండి హెలికాప్టర్ లో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని తుమ్మిసి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జిల్లా అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం, 10:55 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిపురం మండల పరిధిలోని గుండిశెట్టిపల్లి గ్రామంలోని హెచ్ ఎన్ఎస్ఎస్ కెనాల్ వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11:30 గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న బీసీఎన్ గ్రాండ్ ఎదురుగా ఉన్న ఇండేన్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని రైతు బజార్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11:50 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు శాంతిపురం మండలంలో బహిరంగ సభతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకూ కుప్పం పట్టణంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల గ్యాలరీని సందర్శిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు కడపల్లె గ్రామంలోని తన నివాసానికి చేరుకున్న అనంతరం, సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అనంతరం జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష, అలాగే కుప్పం ప్రాంతంలో కోతుల బెడదపై, మనుషులతో ఏనుగుల ఘర్షణ నివారణపై చిత్తూరు జిల్లా డీఎఫ్ఓ తో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 9:45 గంటలకు సీఎం కుప్పం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి, రాత్రి 10:30 గంటలకు దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 11005) ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 22వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ హెచ్ఏఎమ్ ప్రాజెక్టులు, ఈసీ కోళ్ల షెడ్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు తుమ్మిసి హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ లో బెంగళూరుకు, అక్కడి నుండి విమానంలో విజయవాడకు బయలుదేరి, సాయంత్రం 6:20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కుప్పం సొంత నియోజకవర్గం కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు పెట్టుబడులకు సంబంధించిన సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్న