దివిసీమ: దివిసీమ ప్రాంతంలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 57 ఏళ్ల ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘాతుకానికి బలైన మైనర్ బాలిక నిండు గర్భిణిగా మారి, పొరుగునే ఉన్న బాపట్ల జిల్లా రేపల్లెలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగే వరకు ఇంతటి తీవ్రమైన ఉదంతం వెలుగులోకి రాకుండా దాచిపెట్టడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పాఠశాలలో చదువుతున్న సమయంలో బాలిక శారీరకంగా మార్పులకు లోనవుతూ, పొట్ట పెరుగుతూ తరచూ అనారోగ్యానికి గురవుతోందని గమనించిన ఉపాధ్యాయులు అప్పట్లోనే వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది దీనిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. అనంతరం కుటుంబ సభ్యులు బాలికను పాఠశాల మాన్పించి ఇంట్లోనే ఉంచినా, గ్రామంలో కిశోర బాలికల ఆరోగ్యం, బడి మానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సిన పులిగడ్డ అంగన్‌వాడీ, ఏఎన్ఎం సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులకు గానీ, ఐసీడీఎస్ అధికారులకు గానీ, పోలీసులకు గానీ కనీస సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పాఠశాల వర్గాలు హెచ్చరించిన ప్రాథమిక దశలోనే అధికారులు స్పందించి ఉంటే చిన్నారికి ముందే రక్షణ లభించేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడైన ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. కాగా, సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో, ఉపాధ్యాయులు ముందుగానే సమాచారం అందించినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఇంతటి ఘోరం జరిగే వరకు పట్టించుకోని స్థానిక వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలపై సమగ్ర విచారణ జరిపి కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’